సీనియర్ హీరోయిన్లు అందరూ వ్యక్తిగత జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరు ఇప్పటికే కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. ఇటీవల కొందరు పిల్లలకు జన్మనివ్వగా.. మరికొందరు మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల క్రితం తాను తల్లిని కాబోతున్నట్టు ప్రణీతా సుభాష్ కూడా తెలియజేసింది. తాజాగా ఆ లిస్టులోకి నమిత (Namita) వచ్చి చేరింది.
మంగళవారం నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది నమిత. జీవితంలోని కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది 41 ఏళ్ల నమిత. తన పొట్టలోపల ఉన్న శిశువు కాళ్లతో తన్నుతున్నట్టుగా తెలుస్తోందని, ప్రస్తుతం ఆ మాధుర్య క్షణాలను అనుభవిస్తున్నాననే మెసేజ్‌ను ఫోటోలకు ట్యాగ్ చేసింది.
2017లో తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని తిరుపతిలో పెళ్లి చేసుకుంది నమిత. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘సొంతం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నమిత. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో భైరవి పేరుతో నటించినా.. తర్వాత తన సొంత పేరునే స్క్రీన్ పేరుగా మార్చుకుని నటించింది.
సొంతం సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘జెమిని’తోపాటు ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘నాయకుడు’, ప్రభాస్ హీరోగా వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బిల్లా’, బాలకృష్ణతో ‘సింహా’ సినిమాల్లో నటించింది నమిత (Namita).
Follow Us