ఎఫ్3 సినిమా పేరు చెప్పగానే కామెడీ గుర్తొస్తుంది. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుందని అందరూ ఆశిస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా అదే చెబుతున్నాడు. అయితే కామెడీతో పాటు ఎఫ్3 లో కంటెంట్ కూడా ఉంటుందని హామీ ఇస్తున్నాడీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్.
ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, అవగాహన రాహిత్యం లాంటి విషయాలపై చర్చించాడు అనిల్. అలాగే మనిషికి మనీ అనేది ఎంత అవసరం, ఆర్థిక బంధాలు మానవ సంబంధాల్ని ఎలా దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని కూడా చెప్పబోతున్నాడు. ఎఫ్ 2 లో నాజర్‌తో సందేశం అందించిన రావిపూడి, ఎఫ్ 3 లో ఆ బాధ్యతను మురళీశర్మకు అప్పగించాడు.
‘ఎఫ్ 2‘ బంపర్ హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్‌లో ‘ఎఫ్3‘ కథ అనుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను కాన్సెప్ట్ అనుకున్న సమయానికి కరోనా స్టార్ట్ అవ్వలేదు. అయితే, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది అందరికీ. మనిషి జీవితంలో మనీ ఎంత వరకు ఇంపార్టెంట్ అనే పాయింట్‌ను, నిజాయితీగా తెలియజేసేలా సినిమా చేద్దాం అనిపించింది. ‘ఎఫ్ 2‘ లో ఎంతగా నవ్వించినా మంచి కంటెంట్ కూడా అందిస్తున్నాం. అదే విధంగా ‘ఎఫ్ 3‘లో కూడా బాగా నవ్విస్తాం. మనిషి జీవితాన్ని డబ్బు ఎలా రూల్ చేస్తోందనేది వివరిస్తాం’ అని చెప్పాడు అనిల్.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 3‘ సినిమా ఈనెల 27న రిలీజ్ కాబోతోంది. కుటుంబ ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు వీలుగా, ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం లేదు. సాధారణ టికెట్ రేట్లతోనే మొదటి రోజు నుంచి ఈ సినిమా ప్రదర్శించబోతున్నారు. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాల్ని ఇస్తుందని డైరెక్టర్ అనిల్ రావిపూడితోపాటు (Anil Ravipudi) అందరూ అనుకుంటున్నారు.
Follow Us