కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే తపన.. నటనలో మాత్రమే కాదు ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌పైనా పట్టు.. హాలీవుడ్ తరహా కౌబాయ్ సినిమాలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత.. కొత్తదనాన్ని ప్రోత్సహించే తెగువ.. టాలీవుడ్‌ను కొత్త పుంతలు తొక్కించిన నటశేఖరుడు.. సినిమా కలెక్షన్లతోనే కాదు అభిమాన సంఘాల సంఖ్యతోనూ రికార్డులు సృష్టించిన సూపర్‌స్టార్ కృష్ణ నటించిన టాప్10 సినిమాలు.. పింక్‌విల్లా ఫాలోవర్స్ కోసం.
అల్లూరి సీతారామరాజు
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. పద్మాలయా స్టూడియోస్ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ టాప్10 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. విజయనిర్మల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 1974లో ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును కైవసం చేసుకుంది.
సింహాసనం
సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో మరో మైలురాయి ‘సింహాసనం’ సినిమా. పద్మాలయా స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు కృష్ణ. సింహాసనం సినిమా అప్పట్లో తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. 1986లో విడుదలైన ఈ సినిమా యాక్షన్, రొమాన్స్ జానర్‌లో తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మోసగాళ్లకు మోసగాడు
సూపర్‌స్టార్ కృష్ణ చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం మోసగాళ్లకు మోసగాడు. యాక్షన్, డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. విజయనిర్మల హీరోయిన్‌గా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మించారు. 1971లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి రికార్డులు సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఈనాడు
మలయాళ సినిమా ‘ఏకలవ్య’కు రీమేక్‌గా వచ్చిన సినిమా ‘ఈనాడు’. కృష్ణ, చంద్రమోహన్, రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కృష్ణ కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిన ఈ సినిమాకు పి.సాంబశివరావు దర్శకత్వం వహించగా పద్మాలయా పిక్చర్స్ నిర్మించింది. 1982లో విడుదలైన ఈనాడు సినిమాలోని ‘‘నేడే ఈనాడే’’, ‘‘రండి కదలి రండి” అనే రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. వీటిలో ‘నేడే ఈనాడే’ పాట శ్రీశ్రీ రచించడం విశేషం.
అవే కళ్లు
కృష్ణ హీరోగా నటించిన క్రైం థ్రిల్లర్ ‘అవే కళ్లు’. కాంచన హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాను త్రిలోకచందర్ దర్శకత్వం వహించారు. అవే కళ్లు సినిమాలోని అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా తెరకెక్కింది. అవే కళ్లు సినిమాలో పోలీసాఫీసర్‌గా కృష్ణ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
సాక్షి
బాపు దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘సాక్షి’. ‘హై నూన్’ అనే ఇంగ్లీష్ సినిమా కథ ఆధారంగా ‘సాక్షి’ చిత్ర కథను రాసుకున్నారు బాపు. ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించారు కృష్ణ. 1967లో వచ్చిన సాక్షి సినిమా కృష్ణ కెరీర్‌లో కీలక చిత్రం కాగా..దర్శకుడిగా ‘బాపు’ తొలి సినిమా.
గూఢచారి 116
సూపర్‌స్టార్ కృష్ణ తన కెరీర్‌లో నటించిన మూడవ సినిమా గూఢచారి 116. హీరోగా కృష్ణకు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టడమే కాకుండా నటుడిగా కూడా పేరు తెచ్చిపెట్టింది. కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా నటించిన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించింది. విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటానని ఈ సినిమాతో చెప్పకనే చెప్పారు సూపర్‌స్టార్.
పండంటి కాపురం
కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన మరో సూపర్‌హిట్ సినిమా పండంటి కాపురం. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఎస్వీ రంగారావు, గుమ్మడి కీలకపాత్రలు పోషించిన ఈ పండంటి కాపురం సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఈ సినిమాలోని కృష్ణ నటనకు పలువురి ప్రశంసలు దక్కాయి. 1972లో విడుదలైన పండంటి కాపురం సినిమాకు లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు.
రామ్ రాబర్ట్ రహీమ్
విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, రజినీకాంత్, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రామ్ రాబర్ట్ రహీమ్. శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో కృష్ణ.. రాబర్ట్ పాత్రలో నటించి మెప్పించారు. 1980వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
నెంబర్‌వన్
రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సినిమా నెంబర్‌వన్. కృష్ణ సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణకు ఈ సినిమా మరోసారి బ్రేక్ ఇచ్చింది. 1994లో విడుదలైన ‘నెంబర్‌వన్’ ఆ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటి. నెంబర్‌వన్ సినిమాను హిందీలోకి డబ్ చేసి విడుదల చేశారు.
51 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 350 సినిమాల్లో నటించారు సూపర్‌స్టార్ కృష్ణ. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలో సీనియర్లుగా ఉన్న సమయంలో సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) సినిమాల్లోకి వచ్చారు. వారితో పోటీ పడి సినిమాలు చేసి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.
Read More : Superstar Krishna: అత్యంత విషమంగా సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు
Follow Us