అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ప్రతి భారతీయుడిని భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం జూన్3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దేశంలోని 9 నగరాల్లో ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ప్రదర్శిస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ప్రీమియర్ షోల ప్రదర్శనలో భాగంగా జైపూర్‌లోని ఓ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించింది చిత్ర యూనిట్. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు భావోద్వేగానికి గురై సందీప్ ఉన్నికృష్ణన్ అమర్‌రహే.. అంటూ నినాదాలు చేశారు. ఈ మొత్తం దృశ్యాల వీడియోను అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఇలా జరగడం మొదటిసారి చూస్తున్నాను. సినిమాలోని సన్నివేశంలో అమర్ రహే సందీప్ అంటుంటే.. సినిమా చూసే ప్రేక్షకులు కూడా భావోద్వేగంతో లేచి నినాదాలు చేస్తున్నారు. ఇవి నా కెరీర్‌లో ఉద్విగ్న క్షణాలు’ అంటూ చెప్పుకొచ్చాడు శేష్.
కాగా, మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ అభిమానులు, సినీ ప్రేమికులతో ట్విట్టర్‌లో చిట్‌చాట్ చేశాడు. మనకు తెలియని సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఈ సినిమాలో చూపించామని, సామాన్యులు కూడా చూడాల్సిన అసాధారణ సినిమా ఇది అని, ఈ సినిమాకు టికెట్ రేట్లు మామూలుగానే ఉంటాయని, రేట్లు పెంచడం లేదని పలువురు అడిగిన ప్రశ్నాలకు అడివి శేష్ సమాధానమిచ్చాడు.
ఇక, మరో ఇంటర్వ్యూలో తను సినిమాల్లోకి రాకముందు విషయాలు కూడా పంచుకున్నాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నానని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్ (Adivi Sesh).
Follow Us