26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమా ‘మేజర్’(Major). ఈ సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) మేజర్ పాత్ర పోషించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 27న ‘మేజర్’ (Major) సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, పోయినేడాదే ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కరోనా సెకండ్‌వేవ్ కారణంగా వాయిదా పడింది.
పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ‘మేజర్’ (Major) సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రో రేటెడ్ డాల్బీ అట్మాస్ థియేటర్‌లో సౌండ్ మిక్సింగ్ చేస్తున్న ప్లేస్ నుంచి ఫోటోను హీరో అడివి శేష్ (Adivi Sesh) షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎన్‌ఎస్‌జీ కమాండో తాజ్‌హోటల్ వైపు తన టార్గెట్‌ను గురిపెట్టినట్టు కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా అద్భుతమైన చిత్రీకరణను ఈ ఫోటో తెలియజేస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
ఇక, హీరో నాని ప్రొడక్షన్ కంపెనీ వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై అడివి శేష్ హీరోగా ‘హిట్2’ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘ది సెకండ్ కేస్’ అనే ట్యాగ్‌లైన్‌తో తీస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలోనే రూపొందిన ‘హిట్– ది ఫస్ట్ కేస్’ సినిమాలో విశ్వక్‌సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.
1985వ సంవత్సరం హైదరాబాద్‌లో పుట్టిన అడివి శేష్ (Adivi Sesh).. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసి పాపులర్ అయ్యాడు. 2010లో విడుదలైన కర్మ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దొంగాట, సైజ్ జీరో, క్షణం, గూఢచారి, రన్ రాజా రన్ తదితర సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు.
Follow Us