ఏం చేస్తున్నావ్ బాబూ? అని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. ‘ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుంటుంటే మా నాన్న పిలిచాడని వచ్చేశాను’ అని సమాధానం చెప్తాడు యువకుడు. రవిబాబు దర్శకత్వం వహించిన ‘అల్లరి’ సినిమాలోది ఈ డైలాగ్.. ఈ డైలాగ్ చెప్పింది ‘ఈదర నరేష్’. ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చుగానీ అదే ‘అల్లరి నరేష్’ (Allari Naresh) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలియని వాళ్లు ఉండరు. ఆ ఒక్క డైలాగ్ మాత్రమే కాదు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాలోనూ అదే తరహా కామెడీని పండించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు నరేష్. కామెడీ ఒక్కటే కాదు సీరియస్ వేషాలు కూడా వేయగలనని నిరూపించుకుంటున్నాడీ కామెడీ స్టార్. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గమ్యం’ సినిమాలో గాలి శీనుగా నటించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం కామెడీ వేషాలే వేసినా.. ఇటీవల ‘నాంది’ సినిమాలో ఫుల్ లెంగ్త్ సీరియస్ క్యారెక్టర్ చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నాడు నరేష్.
దివంగత స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నరేష్.. మొదట్లో కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లోనే నటించినా..క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో చేసిన సినిమానే ‘నాంది’. ఏ తప్పూ చేయకుండానే శిక్ష అనుభవించిన వ్యక్తి పాత్రలో నరేష్ నటన అందరికీ తెగ నచ్చేసింది. అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్ కనకమేడల విజయ్‌కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు దక్కింది.
నరేష్ మొదటి సినిమా ‘అల్లరి’ సినిమా రిలీజై ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు ఒక థ్యాంక్యూ నోట్ షేర్ చేశాడు. అల్లరి సినిమాలో తనతో కలిసి నటించిన యాక్టర్లకు, 20 ఏళ్లుగా తనను అభిమానిస్తున్న వాళ్లకు, తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వాళ్లకు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం నరేష్.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘సభకు నమస్కారం’ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక, సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అల్లరి నరేష్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాన్న ఈవీవీ సత్యనారాయణ వలనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నాను. నాన్న లేకపోవడంతోనే తనకు ప్లాపులు వస్తున్నాయనడం కరెక్ట్ కాదు. నాన్న చనిపోయిన తర్వాత ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాయి.
ఇటీవల అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ సమయంలో నాన్న బతికుంటే బాగుండేదని అన్నాడు అల్లరి నరేష్. ఇక, మహేష్‌బాబు హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన ‘మహర్షి’ సినిమాలో మహేష్‌బాబు ఫ్రెండ్‌గా నటించాడు నరేష్. ఆ సినిమాలో నటనకుగాను నరేష్‌కు మంచిపేరు వచ్చింది.
దీంతో ఒక నిర్మాత తనను క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోవచ్చు అని అన్నాడని చెప్పాడు నరేష్. అయితే నాంది సినిమా తర్వాత అదే నిర్మాత తనకు ఫోన్ చేసి తనను పొగిడాడని తెలిపాడు. అయితే ఎవరి కెరీర్ ఎలా ముగుస్తుందో ఎవరూ డిసైడ్ చేయలేరని అన్నాడు నరేష్ (Allari Naresh)
Follow Us