బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సంవత్సరానికి అయిదు నుంచి ఆరు సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల అక్షయ్ నటించి సినిమా ‘బచ్చన్ పాండే’. కృతిసనన్, అర్షాద్ వార్సీ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆశించిన మేర ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు బచ్చన్ పాండే. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతున్నాయనే సంగతి తెలిసిందే.
దీంతో సౌత్, బాలీవుడ్ సినిమాలు వాటి వసూళ్ల అంశంపై పలు డిబేట్లు జరుగుతున్నాయి. సౌత్ సినిమాల రీమేక్స్‌పై చర్చించుకుంటున్నారు. సౌత్, నార్త్‌ల మధ్య ఉన్న సినిమాల అంశాన్ని పోటీ అనే కంటే సహకారం అనే విధంగానే చూస్తానని అక్షయ్ చెప్పాడు. ఇటీవల అక్షయ్ మీడియాతో మాట్లాడాడు. సౌత్ సినిమాల కారణంగా బాలీవుడ్ సినిమాలపై ఒత్తిడి పెరిగిందనే అంశంపై అక్షయ్ స్పందించాడు.
సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో ఇబ్బందులేమిటి అని ప్రశ్నించాడు. ‘నా సినిమాని తెలుగులోకి రీమేక్ చేశారు. అక్కడ హిట్ కొట్టింది. ‘విక్రమార్కుడు’ సినిమాను ‘రౌడీ రాథోర్’ పేరుతో మేం నిర్మించాం ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. చిత్రాలను రీమేక్ చేస్తే తప్పేంటి. బాగుంటే హక్కులు కొని మరీ తీస్తున్నాం. సౌత్, నార్త్ అని విడిపోవడం మంచిది కాదు. ఇలా విడిపోవడానికి నేను వ్యతిరేకిస్తాను. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని ఎవరైనా అంటే నాకు అసహ్యం వేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అని నమ్ముతాను. సౌత్, నార్త్ అనే ప్రశ్నలు అడగడం మానేయాలి. గతంలో బ్రిటీష్ వాళ్లు ఈ విధంగానే మనల్ని విడగొట్టి పరిపాలించారు. ఇప్పటికీ మనం పాఠాలు నేర్చుకోలేదు. మనమంతా ఒకే ఇండస్ట్రీ అని నమ్మిన రోజునే మరిన్ని మంచి చిత్రాలను నిర్మించగలుగుతాం’’ అని అక్షయ్ కుమార్ చెప్పాడు.
అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన పృధ్వీరాజ్ సినిమాను ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Follow Us