తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కొడిమోజు మారుతి అనే యువ సింగర్ స్టోరీ ఇది. ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో లో పాల్గొంటున్న ఆ యువకుడు ఉదయం కార్పెంటర్ గా.. సాయంత్రం రెస్టారెంట్లో బేరర్ గా ఉద్యోగం చేస్తూ సంగీత సాధన చేసేవాడు. తన స్నేహితుడు రఘు సాయంతో గాన గాంధర్వుడు.. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు.
అదే సమయంలో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీంతో తోటి స్నేహితులు మారుతిని ఈ షోలో పాల్గొనమని సలహా ఇవ్వడంతో ఆడిషన్స్ ఇచ్చాడు. అదష్టవశాత్తూ ఈ ప్రోగ్రాం కు సెలెక్ట్ కావడంతో అతని టాలెంట్ కు గుర్తింపు లభించినట్లయింది. ఆ షో లో తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క సింగర్ మారుతి కావడం విశేషం. ఇక, అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న మారుతి మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. పేదరికంలో పుట్టి పెరిగినా.. తన సంగీత సాధనను మాత్రం వదలకుండా సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. అంతులేని ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్షతో ఇప్పటి వరకు ఆ షో లో నెగ్గుకుంటూ వచ్చాడు.
ఇప్పటి వరకూ 18ఎపిసోడ్లు ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఇంకా 10ఎపిసోడ్లు మిగిలి ఉన్నాయి. తన కష్టాన్ని నమ్ముకుంటూనే ప్రేక్షకులు తనకు సహకరించాలని కోరుతున్నాడు. ఈ షో లో నెంబర్ వన్ సింగర్ గా నిలబడాలనే తన సంకల్పాన్ని నెరవేర్చాలని వేడుకుంటున్నాడు. అతను పాడిన పాటలతో సోషల్ మీడియాలో సైతం మారుతి వైరల్ అవుతున్నాడు. మరి, మున్ముందు మారుతికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిద్దాం.
Follow Us