తెలంగాణ నక్సలైట్ల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం (Virataparvam). రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' జూన్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో 'విరాట పర్వం' చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచారు. వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
నిజ జీవితంలో సరళ అనే మహిళ పడిన కష్టాల ఆధారంగా 'విరాట పర్వం'లో వెన్నెల పాత్రను తీర్చిదిద్దారు. ఆ పాత్రలో సాయిపల్లవి నటించారు. ఇటీవలే సాయిపల్లవి వరంగల్‌లో సరళ కుటుంబాన్ని కలిశారు.
కన్నీరు పెట్టుకున్న సాయి పల్లవి
తెలంగాణలో జరిగిన నక్సలైట్ల పోరాటంలో సరళ పాత్ర కీలకమైంది. విరాట పర్వం (Virataparvam)లో సరళ పాత్రను సాయి పల్లవి పోషించారు. సరళ కుటుంబ సభ్యులు నిజ జీవితంలో జరిగిన పోరాటాల గురించి సాయి పల్లవితో పంచుకున్నారు. ఉద్యమంలో సరళ అనుభవించిన కష్టాలను విని సాయి పల్లవి కంట తడిపెట్డారు.
'విరాట పర్వం'లో సాయి పల్లవి తన పాత్రలో చాలా గొప్పగా నటించారని ఈ సందర్బంగా సరళ కుటుంబ సభ్యులు అన్నారు. సాయి పల్లవిని చూడగానే తన ఉద్యమ రోజులు గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. సాయిపల్లవి సరళ పడిన కష్టాన్ని విని ఏడ్చేశారు.
సాయి పల్లవిని సరళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. తమ ఇంటికి వచ్చినందుకు సాయి పల్లవితో పాటు 'విరాట పర్వం' టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాయి పల్లవిని తమ ఇంటికి వచ్చిన ఆడపడుచులా భావించి, చీర సారె ఇచ్చి పంపారు. 'విరాట పర్వం' టీమ్ సరళ కుటుంబాన్ని కలిసిన ఫోటోలను సురేష్ ప్రొడక్షన్ టీమ్, తమ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేసింది.
ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట!
విరాట పర్వం (Virataparvam) సినిమాలో ప్రియమణి నక్సలైట్ భారతక్క పాత్రలో నటించారు. జరీనా వాహెబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, ఈశ్వరీ బాయ్, నందితా దాస్, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
'విరాటపర్వం' సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'విరాట పర్వం' సినిమాను ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇంత బలమైన కథను థియేటర్లలో చూపిస్తేనే.. ప్రేక్షకులకు చేరుతుందని భావించి నిర్ణయాన్ని మార్చుకున్నారు. విరాట పర్వం సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us