God Father :"గాడ్ ఫాదర్" మూవీ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) గురించిన టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు !

మోహన్ రాజా (Mohan Raja) తెలుగులో తొలిసారిగా 'హనుమాన్ జంక్షన్' సినిమాకి దర్శకత్వం వహించారు.

గాడ్ ఫాదర్ (God Father) .. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా పేరే. మలయాళ సినిమా 'లూసిఫర్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, సముద్రఖని, సత్యదేవ్ మొదలైన వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

వీరందరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) గురించి. మరి ఈ డైరెక్టర్ గురించి మనం కూడా ఓ టాప్ 10 విశేషాలు తెలుసుకుందామా

ఎడిటర్ మోహన్ కుమారుడిగా సుపరిచితుడు
ఎడిటర్ మోహన్ .. చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఇతని అసలు పేరు మహ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదిర్. మోహన్ పెద్ద కొడుకే మోహన్ రాజా (Mohan Raja). మోహన్ మరో కుమారుడు జయం రవి ప్రస్తుతం స్టార్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. 

రీమేక్ రాజా
తమిళ ఇండస్ట్రీలో అందరూ మోహన్ రాజాని రీమేక్ రాజా అని పిలుస్తుంటారు. ఎందుకంటే, ఈయన అనేక తెలుగు సినిమాలను తమిళంలోకి రీమేక్ చేశారు. 

జయం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు, కిక్ మొదలైన తెలుగు సినిమాలను రాజా తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో సగానికి సగం సినిమాలలో తన సోదరుడు జయం రవి హీరోగా నటించడం విశేషం. 

తొలి చిత్రం తెలుగులోనే
రాజా తన సినీ కెరీర్‌లోని తొలి చిత్రం తెలుగులోనే తీయడం విశేషం. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'తెంకాసీపట్టణం' సినిమాను 'హనుమాన్ జంక్షన్' (Hanuman Junction) పేరుతో తెలుగులో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, అర్జున్, వేణు హీరోలుగా .. లయ, స్నేహ కథానాయికలుగా నటించారు. 

హీరోగా కూడా
మోహన్ రాజా హీరోగా కూడా ఓ చిత్రంలో నటించారు. 2014 లో విడుదలైన తమిళ చిత్రం "ఎన్నశాతం ఇంద నేరమ్" లో రాజా లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి గురు రమేష్ దర్శకత్వం వహించారు. 

లగేరహో మున్నాభాయ్ సినిమా కోసం..
సంజయ్ దత్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం "లగేరహో మున్నాభాయ్"ని తమిళంలో తీయాలని పలువురు నిర్మాతలు భావించినప్పుడు, రాజా డైరెక్షన్‌లో ఆ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే, ఈ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. 

రీమేక్ సినిమాలు చేయడం కష్టమే
చాలామంది రీమేక్ సినిమాలు చేయడం అంటే ఈజీ అనుకుంటారని, కానీ ఏదైనా సినిమాను తమ భాషకు, సంప్రదాయానికి అనుగుణంగా మార్పు చేయడం చాలా కష్టమని రాజా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. 

తనను "జెరాక్స్ రాజా" అంటూ మీడియా ప్రచారం చేసిందని, కానీ సినిమాను నేటివిటీ చెడకుండా తెరకెక్కించడం కూడా ఓ పెద్ద ఆర్ట్ అని రాజా తెలిపారు. విమర్శకుల నోళ్లు మూయించడానికే తాను "తని ఒరువన్" లాంటి ఒరిజనల్ స్క్కిప్ట్‌తో కూడా సినిమా చేసి, బ్లాక్ బస్టర్ హిట్ సాధించానని పేర్కొన్నారు.  

సొంత కథతో
రాజా తొలిసారి సొంతంగా ఒక కథ రాసుకొని తెరకెక్కించిన చిత్రం 'తని ఒరువన్' (Thani Oruvan). ఇదే చిత్రం తెలుగులో 'ధ్రువ' పేరుతో రీమేక్ చేయబడింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

 

వేలాయుధంలో విజయ్ హీరోగా
తమిళ చిత్రం 'వేలాయుధం'ను విజయ్ హీరోగా మోహన్ రాజా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెండు చిత్రమైన అంశాలున్నాయి. తొలిసారిగా జయం రవిని పక్కన పెట్టి, మరో హీరోతో రాజా చేసిన సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి తిరుపతి స్వామి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం 'ఆజాద్'కి పోలికలుంటాయి. 

డబుల్ ధమాకా
'గాడ్ ఫాదర్' (God Father) సినిమా రీమేక్ ద్వారా మోహన్ రాజా డబుల్ ధమాకా పొందినట్లయింది. ఎందుకంటే, ఈ చిత్రంలో ఈయన భారతదేశానికి చెందిన ఇద్దరు అతి పెద్ద హీరోలు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లను డైరెక్ట్ చేశారు.

ప్రభుదేవాతో ఫస్ట్ టైమ్ వర్క్
కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో తొలిసారి పనిచేసే అవకాశం 'గాడ్ ఫాదర్' చిత్రం ద్వారా దొరికిందని మోహన్ రాజా (Mohan Raja) పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. విచిత్రమేంటంటే ప్రభుదేవా తెలుగులో దర్శకత్వం వహించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని, తమిళంలో రీమేక్ చేయగా దానికి మోహన్ రాజాయే దర్శకత్వం వహించారు. 

ఇవండీ.. దర్శకుడు మోహన్ రాజాకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు

Read More: 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయ‌ల‌సీమ‌లో.. ముఖ్య అతిథిగా రానున్న‌ స‌ల్మాన్ ఖాన్‌!

Credits: Instagram
You May Also Like These