ప్రముఖ టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ (Ram Charan). రామ్ చరణ్ అసలు పేరు రామ్ చరణ్ తేజ్. అందరూ ఇతన్ని ముద్దుగా చరణ్ అని పిలుస్తుంటారు. రామ్ చరణ్‌కు 'మెగా పవర్ స్టార్' అనే బిరుదు కూడా ఉంది.
'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రామ్ చరణ్ తన కెరీయర్‌లో సాధించిన అవార్డులపై పింక్ విల్లా స్పెషల్ స్టోరి.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా నటించిన రామ్ చరణ్ ఆ చిత్రంలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అల్లూరి పాత్రలో చూపిన వైవిధ్యమైన నటన అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులు, ప్రముఖలు రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారు.
అసలు రామ్ చరణ్ నటన ఆస్కార్ రేంజ్‌లో ఉందని కూడా పలువురు క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. జేమ్స్‌బాండ్ సినిమాలలో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందంటూ కూడా పలువురు విదేశీ సెలబ్రిటీలు సలహాలు ఇవ్వడం గమనార్హం.
తొలి సినిమాతోనే నంది అవార్డు
2007లో 'చిరుత' సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. అలాగే అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో రామ్ చరణ్‌కు ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ప్రకటించిన'జీ సినీ అవార్డు'లలో కూడా బెస్ట్ మేల్ డెబ్యూట్ సౌత్‌గా రామ్ చరణ్ నిలిచారు.
ఫిలిమ్ ఫేర్ అందుకున్న మగధీరుడు
రామ్ చరణ్ రెండో సినిమా 'మగధీర'. ఈ సినిమా 2009లో విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అలాగే రామ్ చరణ్ 'కాలభైరవ' పాత్రలో కనబరిచిన నటనకు నంది పురస్కారం కూడా వరించింది.
2010 సంవత్సరపు నంది పురస్కారాల వేడుకలో రామ్ చరణ్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించడం విశేషం. అలాగే 2010 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడి కేటగిరిలో రామ్ చరణ్‌కు 'సంతోషం' పత్రికవారు కూడా పురస్కారాన్ని ప్రకటించారు. రచ్చ, నాయక్, ధ్రువ సినిమాలలో నటించిన రామ్ చరణ్ 'ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ సౌత్'కు కూడా నామినేట్ అయ్యారు.
చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన అదుర్స్
రామ్ చరణ్ (Ram Charan) నటించిన సినిమాలలో 'రంగస్థలం' ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ టాలీవుడ్‌లో మరింత పాపులర్ అయ్యారు. స్టార్ డమ్ పక్కన పెట్టి ఓ సాదాసీదా పాత్రలో నటించి మిగితా హీరోలకు ఆదర్శంగా నిలిచారు.
2019 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడి కేటగిరిలో రామ్ చరణ్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును (సైమా అవార్డు) కూడా గెలుపొందారు. అంతేకాకుండా 'జీ సినిమా తెలుగు అవార్డ్స్ 2018'లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. 'రంగస్థలం' చిత్రంలోని నటనకు గాను రామ చరణ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
రామ్ భార్య ఉపాసనకు కూడా 'చిట్టిబాబు' పాత్ర అంటే చాలా ఇష్టమట.
ఇక 'గోవిందుడు అందరివాడే' సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ ఆ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా 'సంతోషం' ఫిలిమ్ అవార్డును సాధించారు. 2016 సంవత్సరంలో చరణ్‌కు 'ఏషియా విజన్ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇండియా' అవార్డు కూడా లభించింది.
ఆర్ఆర్ఆర్ ఎలాంటి అవార్డులు తెస్తుందో..
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటనకు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. పోలీస్ ఆఫీసర్‌గా రామ్ నటన ఇతర దేశాలలోని పలువురు సెలబ్రిటీలకు తెగ నచ్చేసింది. ఇక 'నాటు నాటు' పాట స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా రామ్ చరణ్‌కు ఎన్ని అవార్డులు తెచ్చిపెట్టనుందో వేచి చూడాల్సిందే.
ఏదేమైనా, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే తనయుడిగా రామ్ చరణ్ తన రంగంలో అద్భుతంగా దూసుకుపోతున్నారనే విషయం వాస్తవం.
Read More: RRR: 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ (Ram Charan) నటన ఆస్కార్ లెవల్ అంటున్న అభిమానులు !
Follow Us