Yashoda Movie Review : సమంత నటనా విశ్వరూపాన్ని చూపించిన "యశోద" !

హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకుల డైరెక్షన్‌‌లో ఈ చిత్రం తెరకెక్కింది.

నటీ నటులు: సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీశర్మ, సంపత్ రాజ్

సంగీత దర్శకుడు: మణి శర్మ
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకుడు : హరి, హరీష్

రేటింగ్ : 3/5

నటి సమంత కథానాయికగా నటించిన తాజా చిత్రం "యశోద". హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకుల డైరెక్షన్‌‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. 

కథ :
సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పోషించిన పాత్ర పేరు 'యశోద'. తన సోదరి ఆపరేషన్ కోసం డబ్బులు అవసరమై యశోద 'సరోగసి' అనే ప్రక్రియ ద్వారా వేరొకరికి బిడ్డను కనివ్వడానికి ఒప్పుకుంటుంది. మధు (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే ఆమెకు చెందిన ఆసుపత్రిలో యశోదకు వైద్య పరీక్షలు జరుగుతాయి.

అయితే మధు కనుసన్నలలోనే సరోగసీ పేరుతో ఓ పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుందన్న విషయాన్ని యశోద వేగంగానే పసిగడుతుంది. ఈ క్రమంలో ఆ దుర్మార్గ వ్యవస్థపై పోరాడడానికి నిశ్చయించుకుంటుంది. మరి ఆమె ఆ పోరాటంలో విజయం సాధించిందా? లేదా అన్నదే చిత్రకథ.  

సానుకూల అంశాలు :
ఈ చిత్రంలో యశోద పాత్రలో సమంత అద్భుతమైన నటనా ప్రదర్శనను కనబరిచింది. తన పాత్రకు తగ్గ హావభావాలను చాలా చక్కగా పలికించింది. ప్రథమార్థంలో ఓ సామాన్యురాలిగా కనిపించిన సమంత, ద్వితీయార్థంలో చాలా పవర్ ఫుల్ లేడీగా మనకు దర్శనమిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 'యశోద' పాత్రలో సమంత తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందించింది. ముఖ్యంగా ఇమోషనల్ సీన్స్‌లో తన నటనా అనుభవాన్ని మొత్తం రంగరించి ప్రేక్షకులు తమను తాము మైమరిచిపోయేలా చేసిందామె. 

అలాగే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించడం విశేషం. ఈమె సమంతతో పోటాపోటీగా నటించడం గమనార్హం.  ఒక రకంగా కథను మలుపు తిప్పే పాత్ర ఇది. ఇక సహాయ పాత్రలలో సంపత్ రాజ్, మురళీ శర్మ, రావు రమేష్‌లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. 

 

ప్రతికూల అంశాలు:

దర్శక ద్వయం హరి, హరీష్‌లు కొత్తకథను ఏమీ ఎన్నుకోలేదు. గతంలో 'సరోగసి' అనే అంశం మీద చాలా సినిమాలు వచ్చాయి. సౌందర్య నటించిన '9 నెలలు' సినిమా నుండి ఇటీవలే విడుదలైన 'స్వాతిముత్యం' సినిమా వరకు సరోగసి అనే సంతాన సాఫల్య ప్రక్రియ మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలాగే ఓ 20 సంవత్సరాల క్రితం అనితా చౌదరి కథానాయికగా దూరదర్శన్‌లో 'సుశీల' అనే సీరియల్  కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఏ కథను రాసుకున్నా దానిని ఆసక్తికరంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం ముఖ్యం. 

'యశోద' కథను తెరకెక్కించే క్రమంలో దర్శక ద్వయం కాస్త తడబడ్డారేమోనని మనకు అనిపించక మానదు. ద్వితీయార్థంలో చాలా చోట్ల కథ నత్తనడకన సాగుతుంది. అలాగే లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి. దీంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైనప్పటికీ, సగటు ప్రేక్షకుడు మాత్రం అక్కడక్కడ కాస్త బోర్ ఫీలవుతాడు.

టెక్నికల్ అంశాలు 
ఈ సినిమాకి ప్రధానమైన బలం మణిశర్మ అందించిన సంగీతం. అలాగే ఛాయాగ్రహణం కూడా కథకు అనుగుణమైన రీతిలో ఉంది. అయితే ఎడిటింగ్ ఇంకాస్త పకడ్బందీగా చేసుంటే బాగుండేవి. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
ఫైనల్ వర్డ్
ఈ సినిమాను కేవలం సమంత నటన కోసమే చూడాలి. సమంత అభిమానులను ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది. తన నటనలోని మరో కోణాన్ని సమంత మనకు ఈ సినిమాలో కచ్చితంగా చూపిస్తుంది.

ఒక రకంగా ఈ సినిమాని మనం 'వన్ ఉమన్ షో' అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని మొత్తం సమంత తన భుజాల మీదే వేసుకొని నడిపించింది. సినిమా కాస్త స్లో నేరేషన్‌లో సాగినప్పటికీ.. సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్ ..వీరిద్దరి నటన కోసం ఈ సినిమాను సినీ అభిమానులు తప్పక చూడవచ్చు.

Read More: ‘లైగర్’ ఎఫెక్ట్ పడలేదుగా!.. నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో దుమ్మురేపిన విజయ్ (Vijay Deverakonda) ‘ఖుషి’ మూవీ

Credits: Instagram
You May Also Like These