Soundarya : దివికేగిన అందాలతార.. సినీ అభిమానుల హృదయాలలో కలకాలం నిలిచిపోయే మేటి నటి 'సౌందర్య'

తెలుగు చిత్ర పరిశ్రమలో 1991 - 2002 వరకు దాదాపు అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన మేటి కథానాయిక సౌందర్య (Soundarya)

సౌందర్య .. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఒకవైపు అందం.. మరోవైపు అభినయం.. వెరసి ఎన్నో సంవత్సరాల పాటు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మేటి నటీమణి సౌందర్య. సౌందర్య ఏదైనా సినిమాలో కథానాయికగా నటిస్తే, కచ్చితంగా ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న టాక్ ఆ రోజులలో ఇండస్ట్రీలో బాగా నడిచేది. 

ఈ రోజులలో చాలామంది కథానాయికలు కనీసం పదుల సంఖ్యలో కూడా సినిమాలు చేయకుండానే కెరీర్‌కు స్వస్తి పలికేస్తున్నారు. కానీ సౌందర్య కథ వేరు. ఆమె వందకు పైగా చిత్రాలలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దక్షిణాదిలో దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించిన సౌందర్య, బాలీవుడ్ రంగానికి వెళ్లి అక్కడ అమితాబ్ బచ్చన్ పక్కన కూడా హీరోయిన్‌గా చేసింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. కానీ విధివశాత్తు ఇంత గొప్ప నటి ఓ విమాన ప్రమాదంలో మరణించడం నిజంగానే విషాదకరమైన విషయం. 

ఈ రోజు సౌందర్య 50 వ జయంతి. ఈ సందర్భంగా, తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను గురించి మనమూ తెలుసుకుందాం 

డాక్టర్‌ కోర్సును పక్కన పెట్టి..

సౌందర్య (Soundarya) అసలు పేరు సౌమ్య. డాక్టర్ కావడం కోసం ఎంబిబిఎస్ కోర్సులో చేరిన ఈమె అనుకోకుండా 'గంధర్వ' అనే కన్నడ చిత్రంలో అవకాశం రావడంతో, ఆ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, సౌందర్యకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె తన చదువుకు మధ్యలోనే స్వస్తి పలికి, ఫుల్ టైమ్ సినీ కెరీర్ వైపే అడుగులు వేశారు. 

 

తెలుగులో సూపర్ డూపర్ హిట్లు

సౌందర్య (Soundarya) కన్నడ నటి అయినప్పటికీ కూడా, తెలుగులోనే ఆమె అత్యధిక చిత్రాలలో నటించడం విశేషం. ముఖ్యంగా వెంకటేష్‌తో సౌందర్య నటించిన ప్రతీ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో వీరిద్దరూ హిట్ పెయిర్‌గా కితాబునందుకున్నారు. 

పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, దేవీ పుత్రుడు, జయం మనదేరా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా.. ఇలా చెప్పుకుంటూ పోతే వీరిద్దరు కలిసి నటించిన ప్రతీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

తెలుగులో సౌందర్య (Soundarya) దాదాపు ఆనాటి అగ్రహీరోలందరితోనూ నటించారు. చూడాలని ఉంది (చిరంజీవి),  బాలకృష్ణ (టాప్ హీరో), నాగార్జున (హలో బ్రదర్).. అలాగే శ్రీకాంత్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ మొదలైనవారితో కూడా సౌందర్య సూపర్ హిట్లు ఇచ్చారు.

 

తమిళంలోనూ సౌందర్య సత్తా

రజనీకాంత్‌‌తో కలిసి సౌందర్య నటించిన అరుణాచలం, నరసింహ చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి కోలీవుడ్‌లోనూ ఆమె స్థానాన్ని పదిలం చేశాయి. కానీ ఆమె ఎక్కువగా తెలుగు చిత్రాలవైపే మొగ్గు చూపేవారు. 

భక్తిరస ప్రధాన చిత్రాలలో సైతం

ఒకానొక సందర్భంలో సౌందర్య వరుసగా భక్తిరస ప్రధాన చిత్రాలే చేయడం విశేషం. అమ్మోరు, నాగదేవత, శ్వేతనాగు, శ్రీమంజునాథ.. ఇలాంటి సినిమాలలో కూడా నటించి మహిళా ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు సౌందర్య.

 

సమాజహితం కొరకు పాటుపడుతూ

సౌందర్య (Soundarya) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, ఎన్నో సాంఘిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. అనాథ పిల్లల కోసం పలు ఆశ్రమ పాఠశాలలను, శరణాలయాలను ఏర్పాటు చేశారు. వాటి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించారు. 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' పేరుతో ఇప్పుడు అవే సేవా కార్యక్రమాలను ఆమె భర్త నిర్వహిస్తున్నారు. 

ఎన్నో అవార్డులు, రివార్డులు

అమ్మోరు, రాజా, ద్వీప, ఆప్తమిత్ర సినిమాలకు గాను సౌందర్య నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే పవిత్ర బంధం, అంతఃపురం చిత్రాలలో నటనకు రెండు సార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు. గిరీష్ కాసరవిల్లి దర్శకత్వంలో వచ్చిన ద్వీప చిత్రాన్ని స్వయంగా నిర్మించిన సౌందర్య (Soundarya), ఆ సినిమాకి గాను ఉత్తమ నిర్మాతగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.

 

సావిత్రి ఆఫ్ మోడరన్ సినిమా

సౌందర్య నటనను మహానటి సావిత్రితో పోలుస్తూ, చాలామంది ఆమెను 'సావిత్రి ఆఫ్ మోడరన్ సినిమా'గా పేర్కొంటూ ఉంటారు. సౌందర్య తండ్రి కె.ఎస్ సత్యనారాయణ ప్రముఖ కన్నడ సినీ రచయిత కావడం వల్ల, ఆమె పై తన తండ్రి ప్రభావం కూడా ఎక్కువగా ఉండేదని తను పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. 

కన్నడ పరిశ్రమలో కూడా..

స్వతహాగానే కన్నడ నటి కావడం వల్ల, ఆ పరిశ్రమలో కూడా సౌందర్యకు లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చాయి. విష్ణువర్థన్, అనంతనాగ్, రవిచంద్రన్, శశికుమార్, రమేష్ అరవింద్, అవినాష్ లాంటి పెద్ద పెద్ద హీరోలందరితోనూ ఆమె నటించారు. ఈమె కన్నడలో నటించిన ఆఖరి చిత్రం 'ఆప్తమిత్ర'. ఇదే చిత్రం పలు సంవత్సరాల తర్వాత 'చంద్రముఖి' పేరిట తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. కన్నడంలో సౌందర్య పోషించిన పాత్రనే, తమిళంలో జ్యోతిక చేయడం గమనార్హం.

 

ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ప్రత్యేకం

మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, టాప్ హీరో, పెళ్లిపీటలు, ప్రేమకు వేళాయెరా, ప్రేమకు స్వాగతం, సర్దుకుపోదాం రండి.. ఇలా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో సౌందర్య నటించిన ప్రతీ సినిమా కూడా ఓ ప్రత్యేకమే. ఏ డైరెక్టర్‌కు కూడా సౌందర్య ఇన్ని సినిమాలు చేయలేదు. 

పార్టీ ప్రచారానికి వెళ్తూ..

ఓ ప్రముఖ రాజకీయ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తూ సౌందర్య 2004 లో విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె మరణాన్ని చాలాకాలం వరకు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. తెలుగు చిత్రం 'నర్తనశాల'లో ఆమె అప్పటికి ద్రౌపది పాత్ర పోషిస్తోంది. ఆమె మరణం తర్వాత ఆ చిత్రం కూడా ఆగిపోయింది. 

ఏదేమైనా, ఒక దశాబ్దకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను తన నటనతో ప్రభావితం చేసిన గొప్ప నటీమణి సౌందర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు మనమూ నివాళులు అర్పించేద్దాం. 

Read More: వయసు 62 .. ఇండస్ట్రీ @ 50 .. అన్‌స్టాపబుల్‌ : నేడు నందమూరి బాలకృష్ణ (BalaKrishna) పుట్టినరోజు !

 

You May Also Like These