ప్రాణం ఖరీదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి తెలుగు సినిమా. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 44 సంవత్సరాలు కావస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలో మనం కూడా ఈ సినిమాకి సంబంధించి టాప్ 10 విశేషాలను తెలుసుకుందాం
నాటకమే ఆధారం
ప్రముఖ నాటక రచయిత సి.ఎస్.రావు (CS Rao) రచించిన 'ప్రాణం ఖరీదు' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కె.వాసు ఈ చిత్రానికి దర్శకుడు. ఇతని అసలు పేరు కొల్లి శ్రీనివాసరావు. ఈయన ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ కుమారుడు.
నటుడు కోటా శ్రీనివాసరావుకి ఇదే తొలి చిత్రం
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించిన కోటా శ్రీనివాసరావుకి 'ప్రాణం ఖరీదు' తొలి చిత్రం.
మరో హీరో చంద్రమోహన్
'ప్రాణం ఖరీదు'చిత్రంలో చిరంజీవితో పాటు మరో హీరోగా నటుడు చంద్రమోహన్ కూడా నటించారు. అలాగే రావుగోపాలరావు విలన్ పాత్ర పోషించారు.
భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు
భూస్వామ్య వ్యవస్థపై బడుగు జీవుల తిరుగుబాటుగా ఈ సినిమాను మనం అభివర్ణించవచ్చు. ఇందులో కనకయ్య అనే భూస్వామి పాత్రను రావుగోపాలరావు పోషించగా, అతని వద్ద పనిచేసే పాలేరు దేవుడు పాత్రలో చంద్రమోహన్, నరసింహ పాత్రలో చిరంజీవి నటించారు.
బంగారి పాత్రలో రేష్మా రాయ్
'ప్రాణం ఖరీదు' చిత్రంలో చిరంజీవి ప్రేయసి బంగారి పాత్రలో బెంగాలీ నటి రేష్మా రాయ్ నటించడం గమనార్హం. ఈ సినిమా తర్వాత మళ్లీ రేష్మా రాయ్ ఎప్పుడూ చిరంజీవిని కలవలేదు. చిరంజీవిని పద్మభూషణ్ వరించినప్పుడు.. పరిశ్రమ ఏర్పాటు చేసిన సన్మాన సభలో, ఆమెకు కూడా ప్రత్యేకంగా నిర్వాహకులు ఆహ్వానం పంపడం విశేషం.
జాలాది పాటకు విశేష ప్రజాదరణ
ఈ సినిమాలో ప్రముఖ గేయ రచయిత జాలాది రచించిన 'యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు' అనే పాటకు విశేష ప్రజాదరణ లభించింది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.
ఎల్.ఆర్.ఈశ్వరి పాటలకు ఎనలేని గుర్తింపు
ఈ సినిమాలోని బండమీదుంది గుండోడి దెబ్బ, నోమల్లో మామిళ్ళ తోటకాడ.. అనే రెండు పాటలనూ ప్రముఖ గాయని ఎల్ ఆర్ ఈశ్వరి పాడారు. ఈ పాటలు రెండూ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చాయి.
ఆర్. నారాయణమూర్తి కూడా ఓ పాత్రలో
విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తి కూడా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. తను సొంతంగా సినీ నిర్మాణ రంగంలోకి రాకమునుపు, నారాయణమూర్తి పలు చిత్రాలలో సహాయ నటుడిగా నటించిన సంగతి తెలిసిందే.
మాధవి ప్రధాన హీరోయిన్
'ప్రాణం ఖరీదు' చిత్రంలో మాధవి ప్రధాన కథానాయిక. అలాగే జయసుధ కూడా మరో కథానాయిక. వీరితో చిరంజీవ సరసన రేష్మా రాయ్ అనే కొత్త అమ్మాయికి కూడా అవకాశం కల్పించారు దర్శకులు.
ఇవండీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' విశేషాలు
Read More : చిరంజీవి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రావు రమేష్.. కాళ్లపై పడిన వెర్సటైల్ యాక్టర్
Follow Us