హీరోయిన్లు వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అగ్ర కథానాయికలు.. సీరియల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ తమ సెకెండ్ ఇన్సింగ్స్ బుల్లితెరతో ప్రారంభించారు. అటువంటి కథానాయికలు నటించిన టీవీ సీరియల్స్ ఏంటో చూద్దాం.
రాధిక (Raadhika Sarat Kumar)
సీరియల్స్: పిన్ని, ఇది కథ కాదు, శివయ్య , వాణి - రాణి
తెలుగు, తమిళ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రాధిక బుల్లి తెరపై అంతకు మించి వెలిగిపోతున్నారు. అంతే కాదు రికార్డులు సృష్టిస్తున్నారు. ఆమె సీరియల్స్ రేటింగ్స్ పరంగా చరిత్ర తిరగరాస్తున్నాయి. ఇటీవలే మరో అరుదైన రికార్డును రాధిక సొంతం చేసుకున్నారు. టీవీల్లో ఏకంగా 3430 గంటల పాటు నటించిన ఏకైక బుల్లితెర కథానాయికగా నిలిచారు. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి సొంత బ్యానర్‌లో ధారావాహికలను తీస్తున్నారు.
మంజు భార్గవి (Manju Bhargavi)
సీరియల్: యమలీల
శంకరాభరణం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి మంజు భార్గవి. యమలీల సినిమాలో అలీ తల్లిగా నటించిన ఈ హీరోయిన్, బుల్లితెర యమలీలలోనూ నటిస్తున్నారు.
కస్తూరి (Kasturi)
సీరియల్: గృహలక్ష్మి
నటి కస్తూరికి చాలా మందే అభిమానులు ఉన్నారు. అన్నమయ్య లాంటి సినిమాలో ఈ హీరోయిన్ చేసిన పాత్రను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్‌లో ఆమె సంసార బాధ్యతలు మోసే ఇల్లాలి పాత్రలో నటిస్తున్నారు.
రమ్యకృష్ణ (Ramya Krishna)
సీరియల్: నాగభైరవి
గ్లామర్ రోల్‌తో వెండితెరను షేక్ చేసిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో అత్తగా, బాహుబలిలో అమ్మగా ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ షోలో కూడా తళుకుమని మెరిశారు. యాంకరింగ్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం నాగభైరవి సీరియల్‌తో ఆడియన్స్‌తో సూపర్ అనిపించుకుంటున్నారు.
సుహాసిని (Suhasini)
సీరియల్స్: దేవత, అపరంజి, అష్టాచెమ్మ, ఇద్దరు అమ్మాయిలు
చంటిగాడు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయమైన సుహాసిని, ఆ తరువాత బుల్లితెర స్టార్‌గా మారారు. వరుస హిట్ సీరియల్స్‌తో దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ ధారావాహికలలో బిజీ అయిపోయారు.
రాశి (Raasi)
సీరియల్: జానకి కలగనలేదు
బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యారు రాశి. ఆ తర్వాత పలు సినిమాల్లో అగ్రకథానాయకురాలిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. లాకౌడౌన్‌లో యూట్యూబ్ బ్లాగ్‌లు చేశారు. 'జానకి కలగనలేదు' సీరియల్‌లో అత్త పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం వెయిట్ కూడా పెరిగారు రాశి.
యమున (Yamuna)
సీరియల్స్ : విధి, అన్వేషిత, రక్త సంబంధం, దామిని, మౌనపోరాటం
తెలుగు, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు యమున. కొన్నాళ్లు బుల్లితెరపై బరువైన పాత్రల్లో కనిపించారు. అవి హిట్ అవడంతో సీరియల్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు.
భానుప్రియ (Bhanu Priya)
సీరియల్స్: విశ్వామిత్ర, నాతిచరామి
క్లాసికల్ డాన్సర్ అయిన భానుప్రియ ఎన్నో హిట్ సినిమాలు చేశారు. 'సితార' సినిమాతో ఆమె తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పుడప్పుడు తనకు నచ్చిన కథలు దొరికితే సీరియల్స్, సినిమా అనే తారతమ్యం లేకుండా రాణిస్తూ, తన నటనను కొనసాగిస్తున్నారు.
ఆమని (Aamani)
సీరియల్: ముత్యమంతముగ్గు
ఒకప్పటి టాప్ హీరోయిన్ ఆమని ఇప్పుడు చిన్నితెరపై కూడా తనదైన శైలిలో నటిస్తున్నారు. శుభలగ్నం, శుభ సంకల్పం లాంటి సినిమాలు ఈమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. ఈమె హీరోయిన్‌గా తన కెరీర్ ముగించాక, అడపాదడపా తల్లి పాత్రలనూ చేశారు. ఇప్పుడు ముత్యమంతముగ్గు సీరియల్లో మొదటిసారి బుల్లితెరపై కనిపించనున్నారు.
ప్రభ (Prabha)
సీరియల్: కలిసి ఉంటే కలదు సుఖం
నీడలేని ఆడది చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి ప్రభ. సీనియర్ నటి, క్లాసికల్ డాన్సర్ అయిన ప్రభ కూడా ప్రస్తుతం సీరియల్ దారిలో వెళుతున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం ధారావాహికలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
Follow Us