బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అవకాశం వచ్చినా.. వదిలేశా : సిరి హనుమంతు (Siri Hanmanth)
సిరి హనుమంతు.. బిగ్‌బాస్ (Biggboss) ఐదో సీజన్‌లో టాప్ ఫైవ్‌లో నిలిచి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు సీరియల్స్, సినిమాల్లో నటించిన సిరి బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘బీఎఫ్‌ఎఫ్’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో నటి రమ్య పసుపులేటితో కలిసి ఈ వెబ్ సిరీస్ చేస్తోంది.
ఇక రమ్య పసుపులేటి.. బాలనటిగా పరిచయమై, వెండితెర హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అభిమానులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా రమ్య, సిరి (Siri Hanmanth) మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ "నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే. ఎంబీఏలో చేరాక ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. దీంతో చదువు మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ వచ్చేశా. ఓ ఛానల్లో న్యూస్‌రీడర్‌గా కూడా పనిచేశా. తర్వాత సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. స్టార్ మా వారి ‘ఉయ్యాల జంపాల’ నా మొదటి సీరియల్.
ఆ తర్వాత మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించా. సినిమాల్లో సైతం చిన్నచిన్న పాత్రలు చేశా. కానీ, ఓటీటీ కోసం నటించడం ఇదే మొదటిసారి. హిందీలో వచ్చిన ‘అడల్టింగ్’ (Adulting) అనే వెబ్ సిరీస్‌కు రీమేక్ ఇది. పేరు అలా ఉంది కానీ, ఇందులో ‘అడల్ట్’ కంటెంట్ ఏమీ ఉండదు. నిజానికి ‘అడల్ట్’ అంటే పెద్ద అని అర్థం. వాడుకలో అర్థం మారిపోయింది. ఇద్దరు మెచ్యూర్డ్ అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తారన్నదే కథ" అని వివరించింది.
"చిన్నప్పట్నుంచీ నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలన్నది నా కోరిక. అందుకే ‘హే సిరి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. బిగ్‌బాస్‌కు (Biggboss) వెళ్లకముందే ఆరు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించా. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువలో ఉంది" అని సిరి తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం తనకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారని సిరి పేర్కొంది. "బిగ్‌బాస్‌లో పాల్గొనడం, అందులోనూ టాప్ ఫైవ్‌కి వెళ్లడం చాలా సంతోషకరమైన విషయం. ముందునుంచీ అంతే. టైటిల్ గెలవాలని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రేక్షకులు నా అంచనాలకు మించి ప్రేమనందించారు. వారి సపోర్ట్‌తోనే ఫైనల్స్ వరకూ వెళ్లా. బిగ్‌బాస్ ఓటీటీకి కూడా రమ్మని పిలిచారు. కానీ చేతిలో ఉన్న ప్రాజెక్టుల కారణంగా వెళ్లలేకపోయాను" అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి.