ప్రముఖ ఛానెల్ 'స్టార్ మా' (Star Maa) త్వరలో మరో సరికొత్త షోను మొదలుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ ఛానెల్‌లో ప్రసారమయ్యే పలు డాన్స్ షోలు, కామెడీ షోలు, సింగింగ్ షోలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త షోతో ప్రేక్షకులను అలరించడానికి ఈ ఛానల్ సిద్దమవుతోంది. చిన్నారుల్లోని సింగింగ్ టాలెంట్‌ని బయటకు తీసే క్రమంలో "సూపర్ సింగర్స్ జూనియర్స్" (Super Singer Juniors) పేరుతో ప్రారంభమవుతున్న కొత్త షో, ఈనెల 22 నుండి ప్రారంభం కానుంది.
కాగా, ఈ సింగింగ్ షో ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఈ షోకి హాట్ యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) యాంకర్లుగా వ్యవహరించబోతున్నారు. ఇక ఇదే షోకి న్యాయనిర్ణేతలుగా సింగర్ మనో, చిత్ర, ఉషా ఉత్తుప్.. మెంటార్స్‌గా హేమచంద్ర, రణీనా రెడ్డి వ్యవహరించనున్నారు. షోలో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన వీరు సినిమా డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గాయని చిత్ర అయితే బాలయ్య డైలాగ్ 'ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..' అంటూ రోరింగ్ వాయిస్‌లో అదరగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ షోలో 14 మంది చిన్నారులు పోటీపడుతున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో చిన్నారులు సుధీర్ (Sudigali Sudheer) మీద పంచులు వేశారు. ఒక బాలుడైతే ” పాలకూర పప్పు.. సుధీర్ అన్న నిప్పు” అనడంతో, సుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యి.. వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని అన్నాడు. అనసూయనైతే చిన్నారులు దారుణంగా ఆడేసుకున్నారు. ఏకంగా ఆమెను 'ఆంటీ' అనేశారు. దీంతో అనసూయ తెల్ల మొహం వేసేసింది. మరో సందర్భంలో అనసూయ డ్యాన్స్ చేస్తే.. ఓ బుడ్డోడు సెటైర్ వేశాడు.' డ్యాన్స్ వేయమంటే.. ఇలా కోతిలా ఎగురుతోందేంటి?' అంటూ పరువు తీసేశాడు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్ కామెడీ షో' ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది కమెడియన్స్, యాంకర్స్.. 'స్టార్ మా'కి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు సుధీర్, అనసూయ కూడా 'మల్లెమాల' నుంచి స్టార్ మాకి వచ్చారంటే.. మరి 'జబర్దస్త్' సంగతి ఏమవుతుందో అనేది చూడాలి. లేదంటే ఈ రెండు షోలను ఒకేసారి మ్యానేజ్ చేసే విధంగా 'స్టార్ మా'తో డీల్ చేసుకున్నారేమో తెలియాల్సివుంది!
Follow Us