Ante Sundaraniki review (అంటే.. సుందరానికీ రివ్యూ) : పంచెకట్టుతో సాహసం చేసిన 'నాని' !
సినిమా : అంటే.. సుందరానికీ
నటీనటులు : నాని, నజ్రియా నాజిమ్
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : వివేక్ సాగర్
రేటింగ్ : 3/5
హీరో నాని నటించిన అంటే.. సుందరానికీ (Ante Sundaraniki) సినిమా ఈ రోజే విడుదల అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'అంటే.. సుందరానికీ' చిత్రం తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. హీరో నానికి జోడిగా నజ్రియా ఈ సినిమాలో నటించారు.
ఇటీవలే నిర్వహించిన 'అంటే.. సుందరానికీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. పవన్ రాకతో సినిమా క్రేజ్ పెరిగిందా? అసలు ఈ సినిమా కథ ఏంటి?. బలమైన కథను కామెడీ వెర్షన్‌లోకి తీసుకెళ్లారా? అసలు ఈ సినిమా ఓవరాల్ టాక్ ఏమిటి? మొదలైన విషయాలను మనం కూడా తెలుసుకుందాం.
సుందరం కథ
సుందరం (నాని) ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. సుందరం తల్లిదండ్రులు (నరేశ్ - రోహిణి) ఆచార వ్యవహారాలను కఠినంగా పాటిస్తారు. లీలా థామస్ ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఈమె తల్లిదండ్రులు కూడా తమ మతం పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటారు. సుందరం, లీలా థామస్ ఇద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకుంటారు.
సుందరం తండ్రి తన కొడుకు జాతకంలో దోషం ఉందని భావించి, ఓ జ్యోతిష్యుడిని సంప్రదిస్తాడు. డబ్బు కోసం, ఆ జ్యోతిష్యుడు సుందరం జాతకంలో దోషాలున్నాయని చెబుతాడు. దీంతో, తండ్రి చాదస్తం భరించలేని సుందరం అబద్దాలతో ఆయనను మాయ చేస్తాడు.
అనుకోకుండా ఓ రోజు సుందరం, లీలా థామస్ ప్రేమలో పడతారు. కానీ వేరు వేరు మతాలకు చెందిన వీరి ప్రేమను, పెద్దలు ఒప్పుకోరని తెలుసుకుని.. అబద్ధాలతో ఒకటి అవ్వాలని చూస్తారు. దీంతో లేనిపోని అబద్ధాలు ఆడతారు. ఆ అబద్దాల వల్ల, వీరికే అసలు సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఈ జంట అధిగమించడంతో పాటు.. రెండు మతాలకు చెందిన ఇరువురి కుటుంబ పెద్దలను వీరు ఎలా ఒప్పిస్తారనేదే 'అంటే.. సుందరానికీ' కథ.
డైరెక్షన్ ఎలా ఉందంటే..
మతాల మధ్య వ్యవహారాన్ని వివేక్ ఆత్రేయ తెలివిగా హ్యాండిల్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా కామెడీతో కథను సాగేలా చేశారు. సుందరాన్ని పంచెకట్టులో చూపించి, ఓ పెద్ద సాహసమే చేశారు వివేక్ ఆత్రేయ. అలాగే, నానితో ఓ రేంజ్‌లో కామెడీ చేయించారు. బలమైన కథను, సన్నివేశాలను కామెడీతో ముందుకు తీసుకెళ్లడంలో వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యారు.
మిగతావారి నటన ఎలా ఉందంటే..?
హీరోయిన్ నజ్రియా తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక నరేశ్, రోహిణీల కాంబినేషన్ కామెడీ కూడా బాగుంది. నాని కొలీగ్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. జ్యోతిష్కుడిగా శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన శైలిలో అదరగొట్టాడు. నాని బాస్‌గా నటించిన హర్షవర్ధన్ కూడా, తన పాత్ర పరిధి మేరకు వినోదాన్ని అందించారు. నటుడు పృథ్వీ కూడా సందర్భానుసారంగా కథలో హాస్యాన్ని పండించాడు. ఇక శేఖర్ మాస్టర్ కుమారుడు, ఈ సినిమాలో 'నాని' చిన్ననాటి క్యారెక్టర్ చేయడం విశేషం.
ప్లస్ పాయింట్స్
నాని నటన
కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్..
పాటలు
సాగదీసే సన్నివేశాలు
'అంటే.. సుందరానికీ' ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నవ్వులు పూయిస్తుంది. హీరో నాని ఇలాంటి సినిమా చేయడం ఓ సాహసమే అని చెప్పాలి. సుందరం పాత్రలో నాని ఒదిగిపోయారు. ఆ పాత్రలో పూర్తిగా జీవించేశారు. సరికొత్త కామెడీతో ప్రేక్షకులకు వినోదం అందించారు. సెకండ్ ఆఫ్‌లో ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో జూన్ 10న రిలీజ్ చేశారు. ఇక థియేటర్లలో ఈ చిత్రం ఎలాంటి హిట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Read More: 'అంటే.. సుందరానికీ' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా.. ! 'నాని' సినిమాపై భారీ అంచనాలు !