ఫలక్‌నుమా దాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విశ్వక్‌సేన్ (Vishwaksen). తర్వాత "హిట్" సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు విశ్వక్. తన యాటిట్యూడ్‌తో యూత్‌కు దగ్గరైన విశ్వక్ వెరైటీ కథతో మన ముందుకు రాబోతున్నాడు. 33 సంవత్సరాలు వచ్చినా పెళ్లికాని వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో.
విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ఈనెల 6వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా హీరో విశ్వక్‌సేన్ హైదరాబాద్ నడిరోడ్డుపై చేసిన ప్రాంక్ ప్రమోషన్ వీడియో పలు విమర్శలకు దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ ఎమోషనల్‌గా మాట్లాడారు. "‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు బాగా పండాయి. సినిమాలో అర్జున్‌కుమార్‌కు మనలాగనే భయం. అభద్రతా భావం ఎక్కువ. 33 సంవత్సరాలు వచ్చే వరకు ఇవన్నీ భరించి.. ఇక భరించలేక ఏం చేశాడన్నదే సినిమా కథ. దయచేసి మా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. ఇప్పటివరకూ నేను నాలుగు సినిమాలు మాత్రమే చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు వాటి గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీకి వెళ్లి హీరోని అవుతాను అని చెప్పినప్పుడు అందరిలాగానే మా కుటుంబం కూడా షాకయ్యింది. కానీ నన్ను మా అమ్మ బాగా సపోర్ట్ చేసింది. డ్యాన్స్, యాక్టింగ్‌లో చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాను.
ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. రూ.12 లక్షలు ఖర్చు పెట్టి ‘వెళ్లిపోమాకే’ అనే సినిమా తీశాను. మా సినిమా చూసిన నిర్మాత దానిని కొని థియేటర్లలో రిలీజ్ చేశాడు. కెరీర్‌లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వాటిని కూడా నవ్వుతూ ఎదుర్కోవాలి. మనం ఎదుగుతున్నాం అని చెప్పడానికి అదే నిదర్శనం. నన్ను ఎవరో ఏదో అన్నారని, నాకేదో జరుగుతుందని నేనెప్పుడూ భాధపడలేదు. ఇవన్నీ నాకేం కొత్త కాదు. ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనల తర్వాత తాజాగా సోషల్ మీడియాలో # Vishwaksen పేరుతో నన్ను సపోర్ట్ చేస్తూ చేసిన మెసేజ్‌లు చూసి, నేను సంపాదించిన ఆస్తి అదే అనిపించింది. నాకు మీరే ధైర్యాన్ని ఇచ్చారు.
నా జీవితంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి మా అమ్మ మాత్రమే. అమ్మా.. నీ కొడుకుకి ఏం కాదు.. ఎవరూ ఏం చెయ్యలేరు" అని ఎమోషనల్ అయ్యాడు విశ్వక్‌సేన్ (Vishwaksen). విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు రవికిరణ్ కోలా కథ అందించాడు. విశ్వక్‌సేన్ సరసన రుక్సార్ థిల్లన్ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌వీసీసీ డిజిటల్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మాతలుగా వ్యవహరించారు.
Follow Us