ఆర్.ఆర్.ఆర్. సినిమాను రెండో సారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభను నలుదిశలా చాటిన ఈ సినిమా అన్‌కట్ వెర్షన్‌ను, ఈ సారి విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్స్‌తో ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. జూన్ 1 తేదిన అమెరికాలో ఎంపిక చేసిన 100 థియేటర్స్‌లో .. మళ్లీ RRR సినిమా విడుదల కానుంది.
అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్. సినిమా, విడుదలైనప్పటి నుండీ రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇదే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది.
నార్త్ అమెరికాలో ఆర్.ఆర్.ఆర్. సినిమా 14 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. రాజమౌళి బాహుబలి తర్వాత ఆర్.ఆర్.ఆర్. అమెరికాలో మిలియన్ డాలర్లు వసూళ్లు చేసిన తొలి సినిమాగా రికార్డులు బద్దలు కొట్టింది.
ఇదే క్రమంలో, అమెరికన్ ప్రేక్షకుల కోసం ఆర్.ఆర్.ఆర్ అన్‌కట్ తెలుగు వెర్షన్‌ను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. పూర్తిగా కల్పిత కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌లు చాలా చక్కగా ఒదిగిపోయారు. అగ్ర హీరోలతో హిట్ సినిమా తీయడం రాజమౌళికి సాధ్యమైందని.. ఈ చిత్ర దర్శకుడికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు కూడా దక్కాయి.
Follow Us