మహేష్‌బాబు, తారక్‌ సినిమాల్లో విలన్‌గా కమల్‌ హాసన్ (Kamal Haasan).. రెండు సినిమాలకు ఓకే చెప్పాడని ఇండస్ట్రీ టాక్

రాజమౌళి, మహేష్‌బాబు, కమల్‌ హాసన్

ట్రెండ్‌ సెట్‌ చేసేలా సినిమాలు చేయడంలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ముందు వరుసలో ఉంటాడు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల్లో విలక్షణంగా కనిపించాలనే తపన ఆయనలో రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి కృషి చేస్తున్నాడు కమల్. తాజాగా కమల్ నటించిన సినిమా ‘విక్రమ్’. జూన్‌ 3వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌‌ ఇటీవల విడుదలైంది. ‘విక్రమ్’ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది.  

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ డేట్ల కోసం ఇద్దరు అగ్ర దర్శకులు పోటీ పడుతున్నట్లు సమాచారం. బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. తన సినిమాలో నటించాలని కమల్‌ను సంప్రదించాడని తెలుస్తోంది. మహేష్‌బాబుతో తీసే యాక్షన్ అడ్వంచర్ సినిమాలో కమల్‌ హాసన్‌ను విలన్‌గా నటించాలని రాజమౌళి కోరాడని, కథ నచ్చడంతో కమల్‌ కూడా మహేష్‌ సినిమాలో చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న రాజమౌళి.. మహేష్‌బాబుతో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను పరిశీలిస్తున్నాడు. డిసెంబర్‌‌ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలుకానుంది. 

‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ రేంజ్‌ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘బాహుబలి’ తర్వాత బాలీవుడ్‌లో ఆ స్థాయిలో కేజీఎఫ్ హిట్టయింది. ఎన్నో రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సలార్‌‌ షూటింగ్ జరుగుతూ ఉండగానే తన తర్వాత సినిమాను ప్రకటించాడు ప్రశాంత్. సలార్ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే సినిమాలో తారక్‌ పోస్టర్‌ విడుదల చేశాడు ఈ డైరెక్టర్. దానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పోస్టర్‌లో తారక్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కూడా తారక్‌తో తాను తీయబోయే సినిమాలో విలన్ పాత్ర కోసం కమల్‌ను సంప్రదించాడని తెలుస్తోంది. ప్రశాంత్‌ చెప్పిన కథ, అందులో తన పాత్ర కమల్‌(Kamal Haasan)కు బాగా నచ్చేసిందట. దాంతో కమల్ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడని కూడా కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

You May Also Like These