చిరంజీవి ఈ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు దక్షిణ చలన చిత్రపరిశ్రమ ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొందో తెలిపారు.
"శివాజీ గణేశన్ దక్షిణాదిలో ఓ అద్భుతమైన నటుడు. కానీ భారతీయ సినిమా గురించి ఎక్కడైనా చర్చించేటప్పుడు, ఆయన గురించి ప్రస్తావించకపోవడం నాకు బాధనిపించేది.
విదేశీ సినీ ప్రముఖులతో భారతీయ సినిమా గురించి డిస్కషన్స్ పెట్టేటప్పుడు, కేవలం బాలీవుడ్ లేదా హిందీ సినిమా గురించే మాట్లాడేవారు. కానీ భారతదేశంలో భాషలకు అతీతంగా రాణిస్తున్న ఎందరో గొప్ప నటులు ఉన్నారు.
మలయాళం, తమిళం, తెలుగు, ఒరియా, భోజ్‌పూరి భాషలలో కూడా గొప్ప నటులు ఉన్నారు. అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కనుక మన మధ్య భేద భావన అనేది పోవాలి. నార్త్ అయినా, సౌత్ అయినా.. ప్రతీ సినిమా కూడా భారతీయ సినిమానే. భావోద్వేగాలు అన్నీ ఒక్కటే. అందరూ గొప్ప నటులే.
ఈ రోజు మనం ఒకే తాటి మీద పయనించాలి. ఈ రోజు కచ్చితంగా అలాంటి రోజేనని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ సమస్య ఎక్కడినుండి మొదలైందో నాతో పాటు మీకు కూడా తెలుసు. భారతీయ సినిమా అంటే బహు భాషా సమ్మేళనం" అని తెలిపారు.
సల్మాన్ ఖాన్ కూడా చిరంజీవి మాటలతో ఏకీభవిస్తూ, తన మదిలోని మాటలను బయటపెట్టారు. "ఈ సమస్య ఎక్కడినుండి మొదలైందో నాకు తెలుసు. ఆ రోజులలో ఎవరో ఓ తెలివి తక్కువ జర్నలిస్టు బాలీవుడ్ అనే పదం కనిపెట్టాడు. తర్వాత తనను ఆదర్శంగా తీసుకొని మరికొందరు టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పదాలు కనిపెట్టారు.
కానీ ఇది కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమ అనేది ఒక్కటే. దీనికి భాషా భేదం లేదు. మేము ఎప్పుడూ భారతీయ సినిమా అంతా ఒక్కటేనని భావిస్తాము" అని తెలిపారు.
Follow Us