God Father Mumbai Event LIVE UPDATES : ఒకే వేదికపై చిరంజీవి, సల్మాన్ ఖాన్ ..ఫ్యాన్స్ కేరింతల మధ్య మెగా సందడి !

Updated on Oct 01, 2022 04:25 PM IST
God Father : గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ముంబయిలో అభిమానులు కేరింతల మధ్య అద్భుతంగా జరిగింది.
God Father : గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ముంబయిలో అభిమానులు కేరింతల మధ్య అద్భుతంగా జరిగింది.
"గాడ్ ఫాదర్" సినిమాకి సీక్వెల్ వస్తుందా?

"గాడ్ ఫాదర్" సినిమాకి సీక్వెల్ వస్తుందా? అంటూ ఓ విలేకరి వేసిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు. "ఈ విషయంపై నాకు ఎలాంటి ఐడియా లేదు. కానీ, మలయాళంలో ఇదే సినిమాకి సీక్వెల్ వస్తుందని విన్నప్పుడు, ఒరిజనల్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో మాట్లాడాను. ఆయన పార్ట్ 2 చాలా బాగుంటుందని, సబ్జెక్టు వినిపిస్తానని తెలిపారు.

ఆ సబ్జెక్టు నాకు నచ్చితే, నేను ఆ సినిమా చేస్తానేమో. కానీ నిన్న మోహన్ రాజాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం, ఈ సినిమాకి సీక్వెల్ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు" అని చిరంజీవి తెలిపారు.

 

నాగార్జునకి కూడా ఆల్ ది బెస్ట్ : చిరంజీవి

"గాడ్ ఫాదర్" సినిమా విడుదల రోజునే, నాగార్జున నటించిన "ది ఘోస్ట్" కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి మాట్లాడారు. "ఏ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత దానికి ఉంటుంది. మా ఇరువురి సినిమాలు ఒకదానికి ఒక పోటీ కాదు. నాగ్ హీరోగా నటించిన "ది ఘోస్ట్" సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చిరంజీవి తెలిపారు. 

ముంబయిలో "గాడ్ ఫాదర్" హిందీ ట్రైలర్ లాంచ్ అయ్యాక, సల్మాన్‌ను హగ్ చేసుకున్న చిరు!

సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ సినిమాలో నటించారు : చిరంజీవి

"గాడ్ ఫాదర్" ప్రమోషనల్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ "ఈ సినిమాకి ఒక్క రూపాయి తీసుకోకుండా సల్మాన్ ఖాన్ పనిచేశారు. ఈ సినిమా నిర్మాతలు సల్లూ భాయ్ వద్దకు ఓ రోజు వెళ్లారు. ఓ పెద్ద మొత్తంలో అతనికి చెక్ ఇవ్వాలని భావించారు. అందుకే నా మేనేజర్లమంటూ చెబుతూ ఆయనను కలవడానికి ప్రయత్నించారు. ఆయన కూడా వారి రమ్మని పిలిచారు. 

కానీ సల్మాన్‌‌తో కలిసి మాట్లాడిన కొద్ది సేపటికే వారు తిరిగొచ్చేశారు. ఆయనను కలిసే రిస్క్ మళ్లీ ఎప్పుడూ చేయలేమని చెప్పారు. "మీరు చిరంజీవి గారిపై నాకున్న ప్రేమాభిమానాలను కొనాలని భావిస్తున్నారా" అంటూ సల్మాన్ ఫైర్ అయ్యేసరికి వారు సైలెంట్ అయిపోయారు. నిజం చెప్పాలంటే.. నేను, రామ్ చరణ్ ఇరువురం సల్లూ భాయ్‌కి జీవితాంతం రుణపడి ఉంటాం" అంటూ మెగాస్టార్ చిరంజీవి తన మదిలోని మాటలను పంచుకున్నారు.

 

సౌత్ సినిమా అప్పుడు ఆ గుర్తింపు దక్కించుకోలేపోయింది : చిరంజీవి

చిరంజీవి ఈ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు దక్షిణ చలన చిత్రపరిశ్రమ ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొందో తెలిపారు. 

"శివాజీ గణేశన్ దక్షిణాదిలో ఓ అద్భుతమైన నటుడు. కానీ భారతీయ సినిమా గురించి ఎక్కడైనా చర్చించేటప్పుడు, ఆయన గురించి ప్రస్తావించకపోవడం నాకు బాధనిపించేది. 

విదేశీ సినీ ప్రముఖులతో భారతీయ సినిమా గురించి డిస్కషన్స్ పెట్టేటప్పుడు, కేవలం బాలీవుడ్ లేదా హిందీ సినిమా గురించే మాట్లాడేవారు. కానీ భారతదేశంలో భాషలకు అతీతంగా రాణిస్తున్న ఎందరో గొప్ప నటులు ఉన్నారు. 

మలయాళం, తమిళం, తెలుగు, ఒరియా, భోజ్‌పూరి భాషలలో కూడా గొప్ప నటులు ఉన్నారు. అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కనుక మన మధ్య భేద భావన అనేది పోవాలి. నార్త్ అయినా, సౌత్ అయినా.. ప్రతీ సినిమా కూడా భారతీయ సినిమానే. భావోద్వేగాలు అన్నీ ఒక్కటే. అందరూ గొప్ప నటులే. 

ఈ రోజు మనం ఒకే తాటి మీద పయనించాలి. ఈ రోజు కచ్చితంగా అలాంటి రోజేనని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ సమస్య ఎక్కడినుండి మొదలైందో నాతో పాటు మీకు కూడా తెలుసు. భారతీయ సినిమా అంటే బహు భాషా సమ్మేళనం" అని తెలిపారు. 

సల్మాన్ ఖాన్ కూడా చిరంజీవి మాటలతో ఏకీభవిస్తూ, తన మదిలోని మాటలను బయటపెట్టారు. "ఈ సమస్య ఎక్కడినుండి మొదలైందో నాకు తెలుసు. ఆ రోజులలో ఎవరో ఓ తెలివి తక్కువ జర్నలిస్టు బాలీవుడ్ అనే పదం కనిపెట్టాడు. తర్వాత తనను ఆదర్శంగా తీసుకొని మరికొందరు టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పదాలు కనిపెట్టారు. 

కానీ ఇది కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమ అనేది ఒక్కటే. దీనికి భాషా భేదం లేదు. మేము ఎప్పుడూ భారతీయ సినిమా అంతా ఒక్కటేనని భావిస్తాము" అని తెలిపారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు, రామ్ చరణ్ నటనపై చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఈ మధ్యకాలంలో ఆర్ఆర్ఆర్ సినిమా కథానాయకుడు రామ్ చరణ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని పలు హాలీవుడ్ పత్రికలు వార్తలు వ్రాశాయి. ఈ అంశంపై గాడ్ ఫాదర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో చిరంజీవి స్పందించారు.

"ఇది నేను గర్వపడే విషయం. ఇలాంటి రోజులు రావాలని నేను అనుకున్నాను. ఎట్టకేలకు ఆ రోజులు వచ్చాయి. ఒక టీమ్ కలిసికట్టుగా, ఐకమత్యంగా పనిచేస్తేనే ఇలాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించబడతాయి. డైరెక్టర్ రాజమౌళి కష్టానికి ఇది ప్రతిఫలం లాంటిది. ఇది మనందరికీ గర్వకారణం" అని తెలిపారు. 

ముంబయిలో ఇంత గొప్ప వేడుకను నిర్వహించినందుకు సల్మాన్ ఖాన్‌కి ధన్యవాదాలు : మోహన్ రాజా

గాడ్ ఫాదర్ (God Father) సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ "ఇది ప్రమోషనల్ ఈవెంట్ కంటే ఎక్కువ. సల్లూ భాయ్ లేకపోతే ఈ ఈవెంట్ లేదు. ఇది ఒక రకంగా ఆయనకు మేమిచ్చే థాంక్స్ గివింగ్ మూమెంట్. 

సల్లూ భాయ్ మా సినిమాలో నటించినందుకు ఆయనకు మేం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకే సినిమాలో ఇద్దరు మెగాస్టార్లు నటించడం మామూలు విషయం కాదు. మా కలను వీరు నెరవేర్చారు" అని తెలిపారు.

చిరంజీవి నా కౌచ్ మీద నిద్రపోయారు : సల్మాన్ ఖాన్ చెప్పిన ఫన్నీ స్టోరీ

ముంబయిలోని "గాడ్ ఫాదర్" (God Father) సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. "నేను సాధారణంగా ఎప్పుడూ నిద్రపోవడానికి బెడ్ బదులు కౌచ్ వాడుతుంటాను. 

చిరంజీవి గారికి కూడా అదే అలవాటు ఉందని నాకు తెలియదు. థాయిలాండ్‌లో షూటింగ్ ముగించుకొని మేం ముంబయి బయలుదేరబోయే రోజు.. ఆయన రాత్రంతా కౌచ్ మీదే పడుకున్నారు. 

ఆ తర్వాత లేచి ఉదయం ఫ్లైట్‌కి ముంబయి వెళ్లిపోయారు. నాకు కూడా కౌచ్ మీద పడుకొనే అలవాటు ఉందని, అప్పుడు ఆయనకు నేను చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను" అంటూ ఈవెంట్‌లో నవ్వులు పూయించారు సల్మాన్.