సౌత్‌ సినిమాలకు బాలీవుడ్‌లో (Bollywood) క్రేజ్

బాలీవుడ్‌ (Bollywood)లోకి సౌత్‌ స్టోరీలు

కథ, కథనంపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అయితే కథ రాయడం, దానిని ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చెప్పడం మామూలు విషయం కాదు. అందులోనూ సినిమాను వినోదాత్మకంగా ఎలాగైతే తీయాలో, అదే పద్దతిలో కథను కూడా ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించాలి. దాని బాధ్యత పూర్తిగా దర్శకుడిదే. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రేక్షకుడిని థియేటర్లకు తీసుకురావాలంటే మాత్రం కచ్చితంగా స్టార్ ఇమేజ్‌ ఉన్న హీరోహీరోయిన్‌ ఉండాలి. అంతేకాకుండా వారిని థియేటర్ల వరకు తీసుకొచ్చేలా ఆసక్తి రేకెత్తించే అంశం కూడా సినిమాలో ఉండాలి. సినిమా కథలో ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలనే ఉత్సుకతను మనం సగటు ప్రేక్షకుడిలో కలిగిస్తేనే ముందుగా థియేటర్లకు వచ్చి సినిమా చూడడానికి సిద్ధపడతాడు.

వీటన్నిటికీ ముఖ్యంగా కావలసింది కథ. దానికి తగ్గట్టుగా హావభావాలు పలికించగలిగే నటీనటులు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయగలిగే దర్శకుడు. వీటన్నింటికీ తోడు సినిమాకు కావలసింది సరైన టైటిల్‌. దానికి తగిన ట్యాగ్‌ లైన్. సినిమా హిట్‌ ఫ్లాప్‌లను డిసైడ్‌ చేసే అంశాల్లో అతి ముఖ్యమైన వాటిల్లో టైటిల్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇదివరకు బాలీవుడ్‌ సినిమాలను తెలుగులోకి ఎక్కువగా రీమేక్ చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారుతోంది. సౌత్‌ ఇండస్ట్రీల నుంచి వచ్చే సినిమాలను బాలీవుడ్‌లోకి రీమేక్ చేస్తున్నారు. ఇటీవల తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో హిట్‌ అయిన సినిమా కథలతో హిందీలో సినిమాలు తీస్తున్నారు.

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. దాని తమిళ మాతృకలో హీరోగా నటించిన సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు

అక్షయ్‌ హీరోగా..

తమిళ హీరో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హీరో అక్షయ్ కుమార్‌‌ చేస్తున్నారు. రాధిక మదన్‌ హీరోయిన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్‌‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా, హిందీలో అక్షయ్ నటిస్తున్న ఆకాశం నీ హద్దురా’ సినిమాను సూర్యకు చెందిన ‘2బి ఎంటర్‌‌టైన్‌మెంట్‌’ సంస్ధ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సూర్య బాలీవుడ్‌ నిర్మాతగా మారాడు.

విక్రమ్‌ వేదలో హ్రితిక్..

కోలీవుడ్‌లో మాధవన్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించి సూపర్‌‌హిట్ అయిన యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘విక్రమ్ వేద’. ఈ సినిమాను కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. మాధవన్, విజయ్‌ పోషించిన పాత్రల్లో సైఫ్ అలీఖాన్, హ్రితిక్ రోషన్‌ నటిస్తున్నారు. పోలీస్‌, గ్యాంగ్‌స్టర్‌‌కు మధ్య జరిగే వార్‌‌లో ఎవరు గెలుస్తారనే అంశంతో తెరకెక్కిన ‘విక్రమ్‌ వేద’ హిందీ రీమేక్‌కు పుష్కర్ అండ్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ సేతుపతి చేసిన గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌‌ను హ్రితిక్‌ పోషిస్తున్నాడు. హ్రితిక్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌ను చిత్ర యూనిట్‌ ఇటీవల రిలీజ్ చేసింది. అందులో హ్రితిక్‌ గెటప్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు కూడా.

రణ్‌వీర్‌‌ సింగ్ హీరోగా..

శంకర్‌‌ డైరెక్టర్‌‌గా విక్రమ్ హీరోగా వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా హిందీలో తెరకెక్కించబోతున్నారు. రణ్‌వీర్‌‌ సింగ్‌ హీరోగా ‘అపరిచిత్‌’ సినిమా చేయబోతున్నట్టు చాలారోజుల క్రితమే శంకర్ ప్రకటన చేశాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం వివాదాల్లో ఉంది. సినిమా నిర్మాణ హక్కులు తన వద్ద ఉన్నాయని, తన పర్మిషన్ లేకుండా అపరిచితుడు సినిమాను రీమేక్ చేయకూడని డైరెక్టర్ శంకర్, నిర్మాత జయంతిలాల్‌ గాడాపై ఆస్కార్‌‌ రవిచంద్రన్ కోర్టులో కేసు వేశారు. అలాగే సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎస్‌ఐఎఫ్‌సీసీ)ను కూడా ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం పెండింలో పడింది.

కూతురు సెంటిమెంట్‌పైనా..

 శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ అనాథాశ్రమంలో ఉన్న తన కూతురుని కలుసుకోవడానికి వెళ్లే ప్రయత్నంలో ఎదురైన అడ్డంకులు, కూతురిని చేరుకునేందుకు పడే తపనలో ఆకట్టుకునేలా నటించాడు హీరో కార్తీ. ఈ కథనంతో రూపొందిన సినిమా ‘ఖైదీ’. తమిళంతోపాటు తెలుగులోనూ హిట్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను బాలీవుడ్‌ హీరో అజయ్ దేవ్‌గణ్‌ రీమేక్‌ చేస్తున్నారు. ‘భోలా’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్‌ కానున్న ఈ సినిమాలోని మరో కీలకపాత్రలో టబు నటించింది. ధర్మేంద్ర శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. అజయ్‌ దేవ్‌గణ్‌ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్‌ కలిసి సినిమాను నిర్మిస్తున్నాయి.

బాలయ్య ‘అఖండ’పైనా కన్ను

ఇప్పటికే మన స్టార్‌‌ హీరోల సినిమాలు రీమేక్ చేసిన హిట్‌ కొట్టిన బాలీవుడ్‌ కళ్లు తాజాగా బాలకృష్ణ నటించి బ్లాక్ బస్టర్‌‌గా నిలిచిన ‘అఖండ’పై పడ్డాయి. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన అఖండ రీమేక్‌కు బాలీవుడ్‌లో ఒక బడా హీరో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. డైరెక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియాడ్ ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇందులో అక్షయ్ కుమార్‌‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

షెహజాద్‌ పేరుతో ‘అల వైకుంఠపురంలో’

అలు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ తీసిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టబు కూడా కీలకపాత్ర చేసింది. ముందు నెగెటివ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నెమ్మదిగా హిట్‌ టాక్ సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ‘షెహజాద్‌’ పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతోంది. కార్తీక్‌ ఆర్యన్, కృతీసనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘బచ్చన్‌ పాండే’గా వరుణ్‌తేజ్‌ సినిమా

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కి హిట్‌ టాక్‌ దక్కించుకున్న ‘గద్దలకొండ గణేష్’ సినిమాను బచ్చన్ పాండేగా హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఇక, బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రాన్ని ‘మిషన్ సిండ్రెల్లా’ పేరుతో అక్షయ్‌ తెరకెక్కిస్తున్నారు. సమంత నటించిన యూటర్న్ సినిమాను ఏక్తాకపూర్‌‌ హిందీలో తీస్తున్నారు.

 రీమేక్‌ అవుతున్న ‘భీమ్లానాయక్‌’

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా ముఖ్యపాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా కూడా హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. ఎనర్జెటిక్‌ స్టార్‌‌ రామ్‌ యాక్ట్‌ చేసిన ‘రెడ్‌’ చిత్రం, అల్లు అర్జున్‌ డీజే (దువ్వాడ జగన్నాధం)మూవీ సిద్దార్ధ్‌ మల్హోత్రా హీరోగా రీమేక్ అవుతోంది. రెబల్‌స్టార్ ప్రభాస్‌ నటించిన యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ ఛత్రపతి, అల్లరి నరేష్‌ నటించిన నాంది, బ్రోచేవారెవరురా తదితర సినిమాలు బాలీవుడ్‌ ప్రేక్షకులను త్వరలోనే అలరించబోతున్నాయి. ఇవి కాకుండా జులాయి, క్రాక్, అరుంధతి, సాయి శ్రీనివాస ఆత్రేయ, మానగరం, కోమలి, 16 చిత్రాలను రీమేక్ చేయబోతున్నారు.

You May Also Like These