పాత తరం టాప్ హీరోయిన్లలో సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam) ఒకరు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈమె.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సుహాసిని "భాష" అనే అంశంపై చేసిన కామెంట్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఆమె హిందీ భాష నేర్చుకోవాలంటూ తమిళులను కోరడం పెద్ద వివాదానికి తెరలేపినట్లయింది.
హిందీ భాష జాతీయ భాష అంటే కొందరు ఒప్పుకోరు. అదే లొల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రచ్చగా మారింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ల మధ్య మొదలైన ట్వీట్ల యుద్ధం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే లేవదీసింది. "హిందీ భాష, దక్షిణాది భాషలు" అనే అంశంపై సాగిన డిబేట్ వార్‌లో ఒకరికొకరు గట్టి కౌంటర్లే ఇచ్చుకున్నారు. ఈ వివాదం చల్లారక ముందే సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam) మాట్లాడిన మాటలు, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారయ్యాయి.
హిందీ భాషపై సుహాసిని చేసిన వ్యాఖ్యలను పలువురు భాషాభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు సుహాసిని ఏమన్నారంటే... "హిందీ భాష చాలా మంచిదని.. హిందీ వాళ్లు చాలా మంచి వాళ్లని" అన్నారు. హిందీ నేర్చుకుని మనం కూడా హిందీ వాళ్లతో మాట్లాడవచ్చన్నారు. తమిళ్ వాళ్లు కూడా మంచి వాళ్లేనన్నారు. హిందీ వాళ్లు కూడా తమిళ్ నేర్చుకొని, ఆ భాష మాట్లాడవచ్చన్నారు. తమ ఇంట్లో వర్కర్లు హిందీ, తెలుగు భాషలు మాట్లాడతారని చెప్పారు. ఫలానా భాషే కావాలంటే తిండి కూడా దొరకదని సుహాసిని కామెంట్ చేశారు.
ప్రస్తుతం సుహాసిని మాట్లాడిన మాటలు కొంత మంది తమిళులకు ఆగ్రహం తెప్పించాయి. సుహాసిని బాలీవుడ్‌కు వెళ్లి హిందీ సినిమాలే చేసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. సింగర్ సోనూ నిగమ్ కూడా హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు. ఎక్కువగా మాట్లాడే భాషే తప్ప జాతీయ భాష కాదన్నారు. ఇతర దేశాలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, కొత్త సమస్యలు క్రియేట్ చేయకండంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం భాషపై ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే స్వేచ్చ ఉందని.. ఎందుకు అనవసరమైన రచ్చ? అంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇలా భాషతో ప్రారంభమైన యుద్ధం ఎక్కడికి వరకు వెళుతుందో చూడాలి.
Follow Us